నందమూరి తారకరత్న హీరోగా శీను యారజాల(అంజి శ్రీను) దర్శకత్వంలో కె.ఎఫ్.సి. ఎస్.ఆర్.బి. ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న 'నందీశ్వరుడు' చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన నటిస్తున్న విషయాన్ని ఇంతవరకూ గోప్యంగా ఉంచిన నిర్మాతలు ఇప్పుడు అధికారికంగా ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
నిర్మాతల్లో ఒకరైన గంగాధర్‌రెడ్డి కోట ఆ వివరాలు చెబుతూ 'ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు కొన్ని వస్తున్నప్పటికీ ఆ స్టార్స్ కాంబినేషన్ సీన్లు ఎక్కువగా ఉండటం లేదు.
కానీ మా సినిమాలో తారకరత్న, జగపతిబాబు కాంబినేషన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. ఇద్దరి మధ్య మంచి డైలాగ్ డ్రామాతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఈ నెల పదో తేదితో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 15 నుంచి పాటలను చిత్రీకరించి డిసెంబర్ మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.
చిత్ర దర్శకుడు శీను మాట్లాడుతూ ' తారకరత్న, జగపతిబాబు కాంబినేషన్లో వచ్చే ఒక్కో సన్నివేశం ఓ బ్లాస్టింగ్లు ఉంటుంది. పోలీసింగ్‌కు, సివిల్పోలీసింగ్కు మధ్య జరిగే గొప్ప ఐడియాలజీ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకు మూలం. 'డెడ్లీ సోమా' అనే కన్నడ చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. పార్థుని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యువరాజ్, నిర్మాతలు: గంగాధరరెడ్డి కె, సేగు రమేష్‌బాబు.
నాని, సమంత జంటగా ఎస్.ఎస్. రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రూపొందుతోంది.
అయితే ఇటీవల పలు వెబ్సైట్లలో 'నాన్ ఈ'ని తెలుగు సినిమాకి తమిళ వెర్షన్‌గా పేర్కొంటూ వార్తలు వచ్చాయి. దీనికి రాజమౌళి స్పందిస్తూ "ఆ వెబ్సైట్లు 'నాన్ ఈ'ని డబ్బింగ్ సినిమాగా పేర్కొనడం విచారం కలిగిస్తోంది. అది డబ్బింగ్ వెర్షన్ కాదు. తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరిస్తున్నా.
ఇది ద్విభాషా చిత్రం'' అని స్పష్టం చేశారు. "విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి.
రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫౌల్డ్స్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్పెషల్ ఎఫెక్ట్స్: అడిల్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.
నమిత ప్రధాన పాత్రను పోషించిన జయసింహా పిక్చర్స్ 'లవ్ కాలేజ్' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు జయసింహారెడ్డి మాట్లాడుతూ 'నమిత యోగా టీచర్‌గా ఈ సినిమాలో నటించారు. గ్లామర్‌పరంగానే కాకుండా అభినయపరంగా కూడా ఆమెకి పేరు తెచ్చే సినిమా ఇది. డబ్బింగ్, ఎడిటింగ్ పూర్తయింది. రెండో వారంలో ఆడియోను, చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ (ప్రై) లిమిటెడ్ సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'బాడీగార్డ్' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతుంది.
ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడిస్తూ 'ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. డిసెంబర్లో ఆడియోను విడుదల చేస్తాం. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. వెంకటేష్‌బాబు కెరీర్లోనే ఇది ఓ విభిన్న చిత్రంగా నిలుస్తుంది' అన్నారు.
త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసాద్ మైనేని, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా హాస్యాన్ని పండించే కథానాయకుడు హాలీవుడ్ టాప్‌హీరో జాకీచాన్. ఆసియాలో రూపొందే చిత్రాల్లో జాకీచాన్ చిత్రాలకే అత్యధిక ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జాకీచాన్ చిత్రాలంటే పెద్దలతో పాటు పిల్లలకూ ఎంతో ఇష్టం. ఆయన నటించిన వందవ చిత్రం '1911' వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వందేళ్లనాటి చరిత్రాత్మక కథనంతో తన వందవ చిత్రాన్ని తెరకెక్కించారు జాకీచాన్.
ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, హీరో అన్నీ ఆయనే. 45 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో చైనీస్ భాషలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భారతీయ ప్రేక్షకులకి అందిస్తోంది ఇండో ఓవర్సీస్ ఫిలిం సంస్థ. ఇప్పటి వరకు ఈ సంస్థ 22 జాకీచాన్ చిత్రాలను భారతీయ ప్రేక్షకులకు అందించింది. సంస్ధ ఛైర్మన్ వైఎం ఇలియాస్, డైరెక్టర్ ఫిరోజ్ ఇలియాస్లకు జాకీచాన్‌తో మంచి అనుబంధం ఉంది.
90 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం వందేళ్ల క్రితం అంటే 1911లో జరిగిన ఓ పోరాటగాధ ఆధారంగా తెరకెక్కింది. చైనా రాజు నియంతృత్వ పాలనపై తిరుగుబాటు చేసిన వీరుల యుద్ధగాధ. ఆ పోరాటాన్ని ముందుండి నడిపించే దళపతిగా జాకీచాన్ నటించారు. ఆయన ప్రియురాలిగా ప్రముఖ హాలీవుడ్ నటి బింగ్‌బింగ్ లీ నటించారు. ఇంకా జాకీచాన్ కుమారుడు జాసీచాన్, విన్స్టన్ చా తదితరులు కీలకపాత్రలు పోషించారు.
చారిత్రాత్మక అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో ప్రత్యేక రోజైన 11.11.11న విడుదల చేయబోతున్నారు. తన వందవ చిత్రం భారతీయ ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని జాకీచాన్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు కొన్ని రోజుల క్రితం ఆయన్ని కలుసుకున్న ఇలియాస్ తెలిపారు.